కలం, జోగులాంబ గద్వాల : డ్రగ్స్ రహిత భారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని జిల్లా యువజన అధికారి వి. కోట నాయక్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ‘నశా ముక్త్ భారత్ అభియాన్ – మేరా యువ భారత్’ సంయుక్త నిర్వహణలో శనివారం గద్వాల్ (Gadwal ) లోని ఎంఏఎల్ డి డిగ్రీ & పీజీ కళాశాలలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ.. ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ ముఖ్య లక్ష్యం మత్తు రహిత సమాజాన్ని నిర్మించడమేనని తెలిపారు. దేశ భవిష్యత్తు అయిన యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మత్తు వ్యసనాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.
అనంతరం విద్యార్థులచే ‘నశా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు నుక్కడ్ నాటకం, పాటలు, వ్యాసరచన మరియు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఎస్ఐ శివకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ కలందర్ పాషా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ భాస్కర్, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, డా. కర్ణాకర్, వివిధ కళాశాలల అధ్యాపకులు, యువత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

