కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ గ్రామానికి తెలియజేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ (CPI) ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు కరీంనగర్ (Karimnagar) జిల్లావ్యాప్తంగా ‘ప్రచార యాత్ర’ నిర్వహించనుంది. ఈ ప్రచార యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ కరీంనగర్ నగర కౌన్సిల్ సమావేశం న్యాలపట్ల రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూడు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని, ఎన్నికలకు ముందు దేశ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదని ఆరోపించారు.
నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల భారాన్ని కేంద్రం ప్రజలపై వేస్తుందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలపై మోయలేని భారంగా మారుతుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగడం లేదని ఆరోపించారు. రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోవడం మూలంగా యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని, వారి భవిష్యత్తు అనిశ్చితితో మిగిలిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, మహిళా రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని కోరారు. ధరల పెరుగుదలను నియంత్రించాలని, ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. కార్మిక హక్కులను, చట్టాలను పరిరక్షించాలని, దళిత, ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలని అన్నారు.
బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ప్రధాన డిమాండ్లతో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచార యాత్ర నిర్వహిస్తుందని, ఈ యాత్రను విజయవంతం చేయడానికి సీపీఐ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కదలి రావాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, కసిబోజుల సంతోష్ చారి, సాయవేణి రాయమల్లు, చెంచల మురళి, బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, చిందం మల్లయ్య, కాల్వ కొమురయ్య, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Follow Us On: X(Twitter)

