కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ (Operation Muskaan) విజయవంతంగా ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 314 మంది చిన్నారులను రక్షించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత (CP Swetha) తెలిపారు. రక్షించిన వారిలో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 226 మంది బాల కార్మికులు, 85 మంది బడి మానేసిన (డ్రాపౌట్) విద్యార్థులు కాగా, మరో ముగ్గురు ఇతర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.
తల్లిదండ్రులకు అప్పగింత
రక్షించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ముందు హాజరుపరిచి, కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ (Operation Muskaan) కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 9 సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 9 మంది ఎస్‌ఐలు, 36 మంది పోలీసు సిబ్బందితో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, కార్మిక శాఖ అధికారులు, అలాగే షేర్, స్కోప్, ఎఫ్‌ఎంఎం ఎస్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
130 మంది పక్క రాష్ట్రం వాళ్లే..
రక్షించిన చిన్నారుల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది ఉన్నారని కమిషనర్ తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, కార్మిక శాఖ ద్వారా 92 ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్ల జనరల్ డైరీల్లో 118 మంది చిన్నారుల వివరాలు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. “పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు. బాల్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Follow Us On: Sharechat

