కలం, ఖమ్మం బ్యూరో: మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేస్తూ పాత కూరగాయల మార్కెట్‌లో అక్రమంగా కొనసాగిస్తున్న వ్యాపార షెడ్లపై పురపాలక అధికారులు బుల్డోజర్ ప్రయోగించారు. శనివారం ఉదయం మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో రంగంలోకి దిగి, నిబంధనలకు విరుద్ధంగా వేసిన షెడ్లను పూర్తిగా కూల్చివేశారు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లందు (Yellandu) పట్టణంలోని పాత మార్కెట్ వ్యాపారుల కోసం పురపాలక యంత్రాంగం రెండు నెలల క్రితమే నూతనంగా నిర్మించిన మోడల్ మార్కెట్‌లో ప్రత్యేకంగా గదులను కేటాయించింది. పాత స్థలాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, వ్యాపారులందరూ కొత్త మార్కెట్‌లోనే వ్యాపారాలు చేసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేసింది. అయితే, కొత్త మార్కెట్‌లో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదని, తీవ్ర నష్టాలు వస్తున్నాయని సాకు చూపుతూ కొంతమంది వ్యాపారులు బయటకు వచ్చి తిరిగి పాత మార్కెట్‌కే చేరుకున్నారు. అక్కడ మళ్లీ అక్రమంగా షెడ్లు వేసుకొని తమ వ్యాపారాలను ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకున్న పురపాలక అధికారులు పాత మార్కెట్‌ను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని వ్యాపారులకు పలుమార్లు సూచించారు. అయినప్పటికీ వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తూ మొండిపట్టు పట్టడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. శనివారం జేసీబీతో దాడులు నిర్వహించి అక్రమ షెడ్లను నేలమట్టం చేశారు. పురపాలక నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కేటాయించిన మోడల్ మార్కెట్లోనే వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

