కలం, వనపర్తి: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించబోమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) హెచ్చరించారు. ఖిల్లా ఘణపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో శుక్రవారం నూతన అత్యాధునిక ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పరిశీలన సందర్భంగా కొందరు వైద్యులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు నమోదు చేసిన విషయాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసేలా రికార్డులు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
కొందరి నిర్లక్ష్యం కారణంగానే..
కొందరు వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని.. విధుల్లో నిర్లక్ష్యం, తప్పుడు హాజరు నమోదు, ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం–పెద్దమందడి మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత క్యామరాజు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

