చేనేతకు భరోసా.. ముద్ర రుణాలతో స్వయం ఉపాధి

కలం, చండూరు: చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) బి. చంద్రశేఖర్ (Chandrashekar) పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేనేత రంగం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే రంగమని, కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.

అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికుడు ముద్ర రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ముద్ర పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉందని, వ్యక్తిగతంగా, సంఘాలుగా లేదా క్లస్టర్ల రూపంలో కూడా రుణాలు పొందవచ్చని వివరించారు. బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందుతున్నాయని, చేనేత కళాకారులకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేనేత భరోసా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా కళాకారులు వినియోగించుకోవాలని సూచించారు.

ఇటీవల చేనేత సహకార సంఘాలకు పాలకవర్గాలు ఏర్పాటైన నేపథ్యంలో ఇకపై తరచూ కళాకారులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేనేత కళాకారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చండూరు మాజీ ZPTC కర్నాటి వెంకటేశం చేనేత రంగ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, చేనేత శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>