కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని పీకేఓసీ డీప్ సైడ్ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) బొగ్గు బ్లాక్‌ను సింగరేణి (Singareni)కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో మణుగూరు బండారుగూడెం చౌరస్తాలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య మాట్లాడుతూ… పీకే ఓసీ డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికి కాకుండా జెన్‌కోకు కట్టబెట్టే ప్రయత్నం చివరికి ప్రైవేటీకరణకు దారితీస్తుందని, ఇది మణుగూరు ప్రాంత ఉనికికి, కార్మికుల ఉపాధికి జీవన్మరణ సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి భవిష్యత్తును కాపాడటానికి, జెన్‌కో టెండర్ నుండి తప్పుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే సింగరేణికి రావాల్సిన రూ. 56,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనను అణచివేసేందుకు పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ధర్నాను భగ్నం చేసి, పలువురు నాయకులను అదుపులోకి తీసుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే సింగరేణి వ్యాప్తంగా “మహా ఉద్యమాన్ని” నిర్మించి “ఛలో హైదరాబాద్” కు పిలుపునిస్తామని నాయకులు హెచ్చరించారు.

