కలం, వనపర్తి: ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Wanaparthy Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తిలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన పరీక్షల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేసి ఆగస్టు 12లోగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఈ మూడు సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో బలహీనతలను అధిగమించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తరచూ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతిని అంచనా వేసి అవసరమైన చోట అదనపు బోధన అందించాలని సూచించారు.
ముఖ్యంగా గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ (Wanaparthy Collector), అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా వినియోగిస్తూ పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Also: సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి కొత్త పేరు
Follow Us On : WhatsApp

