పెద్ది ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి: నిరంజన్ రెడ్డి

కలం, వనపర్తి: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం తనతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  (Singireddy Niranjan Reddy) అన్నారు. శుక్రవారం తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించిన ప్రజానాయకుడని, నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఆయనతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన మరణం ఉద్యమ శ్రేణులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో సమైక్యవాద శక్తులను ధైర్యంగా ఎదుర్కొంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డేనని పేర్కొన్నారు.

రైతుల సమస్యల పరిష్కారంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని, వ్యవసాయ రంగానికి అనుకూలంగా ప్రత్యేక జీవో తీసుకొచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. నర్సంపేట ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తితో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలు సడలించి ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందించిన విషయాన్ని నిరంజన్ రెడ్డి స్మరించుకున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, ధర్మా నాయక్, గులాం ఖాదర్ ఖాన్, దేవర్ల నరసింహ, మాధవ్ రెడ్డి, జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్ రెడ్డి, వెంకట్ సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నాగన్న యాదవ్, పలుస శంకర్ గౌడ్, సూర్యవంశం గిరి, చిట్యాల రాము, ఆరీఫ్, పాషా, లక్ష్మణ్ గౌడ్ బ్రదర్స్, గన్నోజు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>