మడికొండ టెక్స్‌టైల్.. నిధులు గోల్‌మాల్!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా మడికొండలోని మినీ టెక్స్‌టైల్ పార్క్‌ (Madikonda Mini Textile) చుట్టూ అవినీతి ఆరోపణలు (Madikonda scam) ముసురుకుంటున్నాయి. పవర్‌లూమ్ యూనిట్ల నిర్మాణం, యంత్రాల కొనుగోలు పేరుతో రూ.65 కోట్ల వరకు నిధులను గోల్మాల్ చేసినట్లు లబ్ధిదారులు, కమిటీ సభ్యులు అంటున్నారు.

చేనేత కార్మికులు ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పని చేసుకునే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పార్క్ను ఏర్పాటు చేశాయి. లబ్ధిదారుల పేర్లతో కొందరు అక్రమార్కులు ఫోర్జరీ సంతకాలు చేసి ఈ స్కామ్కు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, పాత కమిటీ సభ్యుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. మినీ టెక్స్‌టైల్ పార్క్‌లో అక్రమాలపై ఫిర్యాదులు అందిందని, విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్లు జిల్లా సహకార శాఖ చెప్తున్నది.

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పార్క్

తెలంగాణలో చేనేత రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2009లో కేంద్రం ఎంఎస్‌ఎంఈ పరిధిలోని సీజీటీఎంఎస్‌ఈ స్కీమ్ కింద పవర్‌లూమ్ పరిశ్రమలకు ఆర్థికసాయం అందించింది. దీంతో చేనేత కార్మికులు కాకతీయ టెక్స్‌టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ పొదుపు పరస్పర సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో మడికొండలో 60 ఎకరాల భూమిని కేటాయించింది. మినీ టెక్స్‌టైల్ పార్కులో మొత్తం 364 పవర్‌లూమ్ యూనిట్లకు అనుమతి ఇవ్వగా, ఒక్కో యూనిట్‌కు సుమారు 550 గజాల స్థలాన్ని కేటాయించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ వాటా నిధులు చెల్లించారు. ఇప్పటివరకు కేవలం 164 యూనిట్లు మాత్రమే ఏర్పాటు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ఒప్పందం ఒకటి.. నిర్మాణం మరొకటి..

ఒప్పందం మేరకు ప్రతి యూనిట్‌కు సిమెంట్ షెడ్, ప్రహరీ, గేటు, కలర్ రూఫింగ్, ఫ్లోరింగ్, విండోలు, షట్టర్లు, మోటార్ సెట్, ఆఫీసు, విశ్రాంతి గదులు, ఫర్నిచర్‌తో కూడిన పూర్తిస్థాయి పరిశ్రమను అప్పగించాల్సి ఉంది. కానీ, కొంత మేర పనులు చేపట్టిన తర్వాత గిట్టుబాటు కావడం లేదని చెబుతూ కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

రూ.65 కోట్ల గోల్‌మాల్ ఆరోపణలు

పవర్‌లూమ్ యూనిట్ల నిర్మాణం, యంత్రాల కొనుగోలు, ఇతర మౌలిక సదుపాయాల పేరుతో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, అప్పటి కమిటీ సభ్యులు కుమ్మక్కై సుమారు రూ.65 కోట్ల వరకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంతమంది లబ్ధిదారుల పేర్లపై ఫోర్జరీ సంతకాలు చేసి నిధులు డ్రా చేశారని కూడా పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై మడికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ముడి సరుకు పేరుతో మరో మోసం..?

ముడి సరుకు సరఫరా చేస్తామని చెప్పి 33 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.45 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా పోయాడని వాపోతున్నారు. ప్రాజెక్టు నిధుల లెక్కలు అడిగితే కమిటీ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత కమిటీ రికార్డులు లేవంటున్న ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న కమిటీ మాత్రం తమకు గత కమిటీ ఎలాంటి రికార్డులు అప్పగించలేదని చెబుతోంది. తాము బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచే లెక్కలు నిర్వహిస్తున్నామని, గత వ్యవహారాలపై తమ వద్ద పూర్తి సమాచారం లేదని వివరిస్తోంది.

విచారణకు ప్రత్యేక అధికారి

మినీ టెక్స్‌టైల్ పార్క్‌లో అక్రమాలపై ఫిర్యాదులు అందినట్లు జిల్లా సహకార శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు కేటాయించిన నిధులు నిజంగా లక్ష్యానికి చేరాయా..? లేక మధ్యలోనే దారి మళ్లాయా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>