ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: తుమ్మల

కలం, కరీంనగర్ బ్యూరో: సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పిలుపు నిచ్చారు. సూపర్ ఎల్ నినోపై రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కునేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన పీపీటిని ప్రదర్శించారు. జిల్లా ఎల్ నినో ప్రణాళిక, తెలంగాణ జలసిరి పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సూపర్ ఎల్ నినో ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటికి మాత్రమే వచ్చే ఏడాది జూలై వరకు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో కురిసిన వర్షం పంటలకు కొంత మేలు చేస్తుందని, కానీ పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు ఉపయోగపడదని తెలిపారు.

గత రెండు నెలలు సరిగా వర్షాలు సరిగా కురవక పంటల సాగు గణనీయంగా తగ్గిందని, వచ్చే నెలలో ఏ పంటలు సాగు చేస్తే మేలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా వివరించాలని పేర్కొన్నారు. వాటికి కావలసిన అన్ని విత్తనాలు అందుబాటులో పెట్టాలని సూచించారు. మంచి ప్రణాళిక ప్రకారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చూడాలి

గత ఏడాదితో పోలిస్తే భూ గర్భ జలాలు రెండు మీటర్లకుపైగా లోతులోకి వెళ్ళాయని వెల్లడించారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలోని నీరు పంటలకు విడుదల చేసే అవకాశం లేదని, భూ గర్భ జలాల సమాచారం అధికారులు ప్రజలు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ జలసిరి కింద బోర్ వెల్స్ రీచార్జ్ పనులు, పామ్ పాండ్స్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేయించాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాలల ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు.

జిల్లాలోని మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని, రిజర్వాయర్ల నీటిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పంపింగ్ కోసం కావాల్సిన మోటర్లు అదనంగా సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

రైతులకు అవగాహన కార్యక్రమాలు..

ఎల్ నినో, పంటల మార్పిడిపై జిల్లాలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇంచార్జి మంత్రి సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. జిల్లాలో తాగునీటి సరఫరా కోసం శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కీలకమని తెలిపారు. గత ఏడాది జిల్లాలో లక్ష 85 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 78 వేలు సాగు అయిందని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతు భరోసా అందుతున్న రైతులందరికీ ఈ విషయమై ఫోన్లకు సమాచారం పంపుతున్నామని వెల్లడించారు. ఆగస్టులో సాగు చేసే పంటలపై ఇప్పటికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులకు మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు ఆయిల్ పామ్ 1500 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 400 ఎకరాలు పూర్తి చేయించామని, మిగతా పురోగతిలో ఉందని వెల్లడించారు. తెలంగాణ జలసిరి కింద జిల్లాలో నీటి సంరక్షణ పనులు పకడ్బందీగా చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్ఓ జయశ్రీ, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>