కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల ప్రారంభం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా డా. బి.ఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ (City Metro Express Bus) సర్వీసులను ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ముఖ్య నేతలు, అధికారులు ప్రయాణించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. మొదటి దశలో మూడు రూట్ లలో కరీంనగర్ – వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్ – చింతకుంట, కరీంనగర్ – కొత్తపల్లి హవేలీ సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను నడుపుతుందని చెప్పారు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి, విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీలు ఉండే ప్రతిమ, చల్మడ, మానకొండూరు వైపు కూడా బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులు ఆదరిస్తే 24 గంటలు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగర ప్రజలంతా సిటీ బస్సులను వాడుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>