కలం, స్పోర్ట్స్ : భారత ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్ (Brazil) సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు తొలిసారిగా భారత గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ చారిత్రాత్మక అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ను అక్టోబర్ 3న కోల్‌కతాలో(Kolkata) నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ 25, 29 తేదీలలో రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడిన అనంతరం బ్రెజిల్ (Brazil) సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు తొలిసారిగా భారత గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ చారిత్రాత్మక అంతర్జాతీయ స్నేహపూర్వక జట్టు భారత్‌కు రానుంది. కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో భారత్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. 1992లో ఫిఫా ర్యాంకింగ్స్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత భారత్ ఇంతటి అత్యుత్తమ ర్యాంక్ ఉన్న జట్టుతో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
కెప్టెన్ మార్కిన్హోస్ నేతృత్వంలోని బ్రెజిల్ జట్టులో కాసెమిరో, మాథ్యూస్ కున్హా వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై భారత ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఏఐఎఫ్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ.. బ్రెజిల్ వంటి ప్రపంచ దిగ్గజ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం భారత ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పేర్కొన్నారు. జాతీయ జట్ల డైరెక్టర్ సుబ్రతా పాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో ఒకటైన బ్రెజిల్‌తో ఆడే అవకాశం భారత ఆటగాళ్లకు గొప్ప అనుభవాన్ని అందిస్తుందని, వారి ఆటతీరును మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

