కలం, ఖమ్మం బ్యూరో : అర్హులైన నిరాశ్రయులకు, పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ప్రధాన లక్ష్యమని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి. దేవి మానస తెలిపారు. మదర్ థెరిసా నిరాశ్రయుల ఆశ్రయ గృహాన్ని, ఖమ్మం జిల్లా (Khammam) కారాగారాన్ని ఆమె గురువారం సందర్శించారు. మొదటగా మదర్ థెరిసా ఆశ్రయ గృహాన్ని పరిశీలించిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, అక్కడి వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
నిర్వాహకులతో మాట్లాడి వారికి మెరుగైన వసతులు, సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించి జైలు పరిసరాలు, ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం, న్యాయవాది నియామకం పొందడం ప్రతి అర్హుడైన పేద ఖైదీ రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఈ సేవలను ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. న్యాయాన్ని అందరికీ చేరువ చేయడమే తమ సంస్థ ధ్యేయమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమాల్లో జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, ఆశ్రయ గృహ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు.

