రెడ్ అలర్ట్.. ముందస్తు చర్యలపై పొంగులేటి టెలికాన్ఫరెన్స్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణపై వాయుగుండం ప్రభావం నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో గురువారం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలు, రాబోయే రెండు రోజుల్లో కురిసే వ‌ర్షాల‌పై అధికారుల‌కు దిశానిర్ధేశం చేశారు.

అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి..

ఛత్తీస్‌గఢ్ మీదుగా తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు కదలటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనకు చోటుచేసుకోకుండా చూడాలని రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా స్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో స‌మ‌న్వ‌యం చేసుకొని పర్యవేక్షించాలన్నారు.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్.. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశామ‌ని మంత్రి తెలిపారు. వ‌చ్చే 2 రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే జిల్లాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని.. ముంద‌స్తుగానే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..

వర్షాల ప్రభావం (Telangana Rains) ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పొంగులేటి ఆదేశించారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరంలో హైడ్రా, జిహెచ్ ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>