కలం, కరీంనగర్ బ్యూరో: చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో దాచి ఉంచిన రూ.26 లక్షల నగదును చోరీ చేసిన కేసు (Karimnagar Theft Case)ను కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ప్రధాన నిందితుడు తగరం శంకర్ లాల్ ను అరెస్టు చేశారు. బాధితుడి చిన్ననాటి స్నేహితుడే శంకర్ లాల్ అని వెల్లడించారు. అతని వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ కారు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు అడెపు రేష్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి..
పోలీసుల వివరాల ప్రకారం, భూమి విక్రయించి ఇంట్లో దాచిన నగదు గురించి ముందే తెలుసుకున్న శంకర్ లాల్, ఇంటి నిర్మాణం, అదనపు తాళంచెవి ఉంచే స్థలంపై ఉన్న అవగాహనతో చోరీకి పాల్పడ్డాడు. అదనపు తాళంచెవి లభించకపోవడంతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.26 లక్షలు అపహరించాడు. కేసును ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి దర్యాప్తు చేసి ఛేదించగా, పోలీసు కమిషనర్ గౌస్ ఆలం బృందాన్ని అభినందించారు. అధిక మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
దొంగతనానికి పాల్పడింది ఎవరంటే!
బాధితుడు అటవీశాఖ అధికారి కాగా.. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త శంకర్ లాల్ కావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ కు చెందిన అటవీశాఖ అధికారి గుడిమల్ల శ్రీనివాస్.. కరీంనగర్ జిల్లా తీగల గుట్ట మణికేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని 26 లక్షలకు విక్రయించారు. ఆ నగదును తన అద్దె ఇంటిలో దాచిపెట్టగా.. ఈ మధ్యలో ఆ డబ్బు అవసరం పడలేదు. గత నెల చివరి వారంలో డబ్బు అవసరం ఉండడంతో ఓ రోజు ఆ గదికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి ఉంది.
తీసుకొచ్చిన రూ 26 లక్షలు దొంగతనానికి గురయ్యాయని తెలుసుకొని ఇంతకు ముందు ల్యాప్ టాప్ దొంగతనం చేసిన వ్యక్తే తన ఇంట్లోనూ నగదును దొంగతనం చేశాడని బాధితుడు నిర్ధారణకు వచ్చాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు శంకర్ లాల్ దొంగతనం చేసినట్లు నిర్ధారించి మంగళ వారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు.

