కరీంనగర్ ఇంటి డెకాయిటీ కేసు.. విస్తుపోయే నిజాలు!

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును (Bhagathnagar Dacoit Case) కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు ఇలా..

భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.

యూపీలో గాలింపు.. ముగ్గురు అరెస్ట్

కేసు (Bhagathnagar Dacoit Case) దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల అరెస్ట్..

1.సల్మాన్ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ వద్ద రూ.84,000 నగదు,11.95 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
2. సల్మాన్ (22), కూలీ, మీరట్ వద్ద రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ వద్ద రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా  రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు ,64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీన పరుచుకున్నారు.

సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు!

దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు.
అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు.
కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా  మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.

పరారీలో ప్రధాన నిందితులు

అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్  న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Follow Us On : WhatsApp
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>