ఏపీలో మ‌రో రాష్ట్ర విభ‌జ‌న.. మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: అమ‌రావ‌తి (Amaravati) కి కేటాయిస్తున్న నిధుల‌పై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు (Chandrababu) ఒక్క ప్రాంతానికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, డ‌బ్బంతా తీసుకెళ్లి అమరావతికే పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రం మొత్తం డ‌బ్బంతా ఒకే చోట‌ ఖ‌ర్చు చేయ‌డం ధ‌ర్మ‌మేనా అని ప్ర‌శ్నించారు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే రాష్ట్ర విభ‌జ‌న‌కు డిమాండ్ రావొచ్చ‌ని వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ‌లో నిధుల గురించి వ‌చ్చిన విబేధాల వ‌ల్ల‌నే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింద‌న్నారు. త‌మ ప్రాంతంలో ఉన్న నిధులు త‌మ‌కే ద‌క్కాల‌ని, త‌మ ప్రాంతం అభివృద్ధి చెందాల‌న్న ఆకాంక్ష‌తోనే ఏపీ వాళ్ల‌ను త‌రిమేశార‌న్నారు.

ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు అదే ప‌ని చేస్తున్నార‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన క‌మిటీకి, రాష్ట్ర ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, మ‌న్యం, రాయ‌ల‌సీమ ప్రాంతాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అన్ని ప్రాంతాల‌కు సంప‌ద స‌మానంగా పంపిణీ చేయాల‌న్న రాజ్యాంగ సూత్రాల‌కు చంద్ర‌బాబు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ఇంతటి అనుభ‌వం ఉన్న వ్య‌క్తి చివ‌రి ద‌శ‌లో ఇలా చేయ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. మ‌ళ్లీ ఏదో ఒక రోజు మ‌రో రాష్ట్ర డిమాండ్ వ‌స్తుంద‌న్నారు. ఇక్క‌డి నుంచి మీరు వెళ్లిపోండి అని ప్ర‌జ‌లే డిమాండ్ చేస్తార‌ని చెప్పారు. కొన్ని ప్రాంతాల‌ను, అక్క‌డ ఉన్న స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం స‌రికాద‌ని, చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా తీరు మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>