కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ (Gukesh) మరోసారి తన కిరీటాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. 2026 ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్‌తో గుకేశ్ తలపడనున్నాడు. ఈ విషయాన్ని ఫిడే మంగళవారం ప్రకటించింది.
ఈ ప్రతిష్ఠాత్మక పోరు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనుంది. మొత్తం 14 క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. 14 గేమ్‌ల తర్వాత స్కోరు సమంగా ఉంటే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
ప్రపంచ చెస్ చరిత్రలోనే…
మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి గుకేశ్, సిందరోవ్ ఇద్దరికీ 20 ఏళ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసు ఆటగాళ్ల మధ్య జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోరుగా ఇది నిలవనుంది. 2024లో సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
అప్పటికి ఆయన వయసు కేవలం 18 ఏళ్లు. చివరి క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి ప్రపంచ టైటిల్ గెలిచిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ కిరీటం గెలిచిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు. మరోవైపు, 2026 ఫిడే కాండిడేట్స్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి సిందరోవ్ ఈ అవకాశం దక్కించుకున్నాడు. 2025 ఫిడే వరల్డ్ కప్ విజయం తర్వాత ఇది అతడి మరో పెద్ద విజయంగా నిలిచింది.
జెనీవాను అందుకే ఎంపిక చేశాం..
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్, ఫిడే తాత్కాలిక అధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్, అమెరికా, సైప్రస్ కూడా ఈ టోర్నీ నిర్వహణకు ఆసక్తి చూపాయని తెలిపారు. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత తటస్థ వేదికగా జెనీవాను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ అభిమానులు ఈ పోరును ఆసక్తిగా వీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్విస్ చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆండ్రే వోగ్ట్‌లిన్ కూడా జెనీవా ఎంపికపై ఆనందం వ్యక్తం చేసినట్లు ఫిడే తెలిపింది. ప్రపంచ స్థాయి చెస్ టోర్నీ మరోసారి స్విట్జర్లాండ్‌కు రావడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

