కలం, నాగర్ కర్నూల్: ఆదివాసీల అభ్యున్నకి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
నాణ్యమైన కోచింగ్ అందిస్తాం..
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. నల్లమల ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. నల్లమల ప్రాంతంలో సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
పలు పాఠశాలల్లో శంకుస్థాపనలు..
మంత్రి అడ్లూరి మొదట మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ, డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, అచ్చంపేట, ఇనోల్, బాణాల, చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థల్లో ప్రహరీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అధికారులు అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం..
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయని వివరించారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఈవో రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

