పంట పొలాల‌కు ప‌వ‌ర్ క‌ట్స్.. రోడ్డెక్కిన సంగారెడ్డి రైతులు

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా మంజీరా న‌దిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు దిగువన పంటలు సాగుచేసుకుంటున్న రైతులకు విద్యుత్ శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. పంట‌ పొలాల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు అక‌స్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందలాది రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. పొలాలకు నీరందే మార్గం లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళ‌న‌లకు దిగుతున్నారు.

రెట్టింపైన సాగు నీటి కష్టాలు

పుల్కల్ మండ‌లంలోని పోచారం, మిన్ పూర్, కోడూరు, ఇసోజీపేట, గొంగ్లూరు గ్రామాలు సింగూరు ప్రాజెక్టు దిగువ భాగంలో మంజీరా న‌ది తీరానికి దగ్గరలో ఉంటాయి. సింగూరు ప్రాజెక్టు నిర్మాణమైనప్పటి నుంచి 40 ఏళ్లుగా మంజీరా నీటినే నమ్ముకున్నారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో మంజీరా తీరప్రాంత గ్రామాల్లో సాగునీటి స‌మ‌స్య ఏర్పడింది.

ఒకవైపు సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడంతో ప్రాజెక్టు అయ‌కట్టు కింద ఉన్న 40 వేల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చే ప‌రిస్థితి లేక‌పొవ‌డంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవ‌లం బోర్ల మీద అధార‌ప‌డి మాత్రమే వ్యవ‌సాయం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మంజీరా జలాల ఆధారప‌డి వేలాది ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేశారు. ఇదే స‌మ‌యంలో మోటార్లకు స‌ర‌ఫ‌రా అయ్యే విద్యుత్‌ను నిలిపివేయడం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ‌ర్షభావ ప‌రిస్థితుల్లో మంజీరా నీళ్లనే న‌మ్ముకొని వ్యవ‌సాయం చేస్తున్నారు. పవర్ కట్‌తో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.

తాగునీటి కోస‌మేనా?

పంట‌పొలాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డానికి ప్రధాన కార‌ణం సింగూరు ప్రాజెక్టు ప్రసుత్త పరిస్థితి. సింగూరు మ‌రమ్మత్తుల కోసం ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేసి, కేవ‌లం తాగునీటి అవ‌స‌రాల కోసమే నీటికి నిల్వ ఉంచారు. జ‌ల‌మండ‌లి ద్వారా హైద‌రాబాద్ సిటీ, మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఉమ్మడి మెద‌క్, నిజామాబాద్ జిల్లాల‌కు తాగునీరును జాగ్రత్తగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం- 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం- 4.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వ‌ర్షభావ ప‌రిస్ధితుల ద్రష్ట్యా మ‌రో రెండు నెల‌ల‌పాటు సింగూరు ప్రాజెక్టులోని నీటికి పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను నిలిపివేసినట్టు తెలుస్తోంది. మ‌రోవైపు గ‌త రెండు రోజులుగా సింగూరు ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా ఇన్ ఫ్లో రావ‌డం మొద‌లైంది. ప్రసుత్తం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో- 637 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- 470 క్యూసెక్కులు‌గా ఉన్నది.

రైతుల అందోళ‌న‌

పంట‌ పొలాల‌కు విద్యుత్ నిలిపివేయ‌డంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుల్కల్ మండ‌ల కేంద్రంతోపాటు, ప‌లు గ్రామాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిర‌స‌న తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయ‌డంతో వేసుకున్న పంట‌లు ఎండిపోతాయని, తక్షణమే కరెంట్ పునరుద్ధరించాల‌న్నారు. లేకుంటే ఆందోళల‌ను మరింత ఉధృతం రైతులు చేస్తామన్నారు. యాసంగి పంట పూర్తి అయ్యే వ‌ర‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని విద్యుత్‌ను పున‌రుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>