మలేషియా గోల్ఫ్ టోర్నీలో మెరిసిన గుంతాస్..

కలం, స్పోర్ట్స్ : మలేషియాలోని సెలంగోర్‌లో జరుగుతున్న మలేషియన్ లేడీస్ అమెచ్యూర్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీలో(Malaysian Ladies Amateur Open 2026) భారత యువ గోల్ఫర్ గుంతాస్ కౌర్ సంధూ (Guntas Kaur Sandhu) అద్భుత ప్రదర్శన చేసింది. తొలి రౌండ్‌లో ఆకట్టుకునే ఆటతీరుతో ఆమె ఉమ్మడి రెండో స్థానంలో నిలిచింది. చండీగఢ్‌కు చెందిన 15 ఏళ్ల గుంతాస్.. తొలి రౌండ్‌లో వన్ ఓవర్ 73 స్కోర్ నమోదు చేసింది. దీంతో మరో ముగ్గురు క్రీడాకారిణులతో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ గోల్ఫ్ యూనియన్ (IGU) ఈ టోర్నీ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన భారత జట్టును పంపించింది. మరో భారత క్రీడాకారిణి పంచ్‌కులాకు చెందిన 19 ఏళ్ల సీరత్ కాంగ్ టూ ఓవర్ 74 స్కోర్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఐజీయూ లేడీస్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ర్యాంకింగ్స్‌లో సీరత్ అగ్రస్థానంలో ఉండగా, గుంతాస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

జాతీయ స్థాయిలోనూ సత్తా

గుంతాస్, సీరత్ ఇద్దరూ జాతీయ స్థాయిలో మంచి రికార్డును కలిగి ఉన్నారు. గత సీజన్‌లో సీరత్ 20 టోర్నీలలో పాల్గొని 12 సార్లు టాప్-10లో నిలవడంతో పాటు ఒక టైటిల్‌ను గెలుచుకుంది. ఇక గుంతాస్ 20 టోర్నీలలో  పాల్గొని 13 సార్లు టాప్-10లో నిలిచింది. నాలుగు టోర్నీలలో విజేతగా నిలిచి తన ప్రతిభను చాటుకుంది.

భారత్‌కు టీమ్ విభాగంలో మూడో స్థానం

తొలి రోజు ఆట ముగిసే సరికి మలేషియాకు చెందిన ఫోంగ్ జీ యు వన్ అండర్ 71 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. టీమ్ ఛాంపియన్‌షిప్ విభాగంలో భారత్ త్రీ ఓవర్ 147 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గ్లెన్‌మేరీ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరుగుతున్న ఈ 40వ ఎడిషన్ టోర్నీలో 11 దేశాలకు చెందిన 54 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారు. తొలి రౌండ్‌లో మూడు బర్డీలు సాధించానని గుంతాస్ తెలిపింది. కోర్స్ పరిస్థితులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఐజీయూ సర్క్యూట్‌లో నేర్చుకున్న మెళకువలను ఈ టోర్నీలో ఉపయోగిస్తున్నానని పేర్కొంది. మిగిలిన రెండు రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో ఆడి మంచి ఫలితం సాధిస్తాననే నమ్మకం ఉందని గుంతాస్ వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>