కలం, స్పోర్ట్స్ : 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు (Saransh Jain) భారత టెస్టు జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చింది. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), గాయపడటంతో జట్టులో ఏకైక ఆఫ్ స్పిన్నర్‌గా సారాంశ్‌కు అవకాశం లభించింది. 1998లో రాబిన్ సింగ్ తర్వాత 33 ఏళ్లు దాటిన వయసులో భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశం పొందిన తొలి ఆటగాడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. దీంతో ఆయన ప్రయాణం క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశమైంది. సారాంశ్ జైన్ కెరీర్ ప్రారంభం అంత సులభం కాదు. 2014లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఆయన.. తొలి ఎనిమిదేళ్లలో కేవలం ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లే ఆడగలిగాడు. అవకాశాలు తక్కువ వచ్చినా నిరాశ చెందకుండా కష్టపడి తన ఆటను మెరుగుపరుచుకున్నాడు.
2022లో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో 13 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సారాంశ్ (Saransh Jain) కెరీర్ పూర్తిగా మారిపోయింది. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున 16 వికెట్లు, రెండు అర్ధశతకాలతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అనంతరం రంజీ సీజన్‌లో 518 పరుగులు చేయడంతో పాటు 30 వికెట్లు తీసి అద్భుత ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించాడు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న సారాంశ్.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నుంచి విలువైన సూచనలు అందుకున్నాడు. “ఏదైనా సాధించాలంటే కష్టపడి పనిచేయాలి” అనే హర్భజన్ మాటలు తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచాయని సారాంశ్ తెలిపాడు.
సారాంశ్ బౌలింగ్‌లోని ఫ్లైట్, కంట్రోల్, వికెట్లు తీయాలనే తపన తనను ఆకట్టుకుందని హర్భజన్ కూడా ప్రశంసించారు. బౌలర్లు కేవలం ఓవర్లు పూర్తి చేయడం కాదు.. వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టాలని, ఆ లక్షణం సారాంశ్‌లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన సిరీస్‌లో సారాంశ్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో పాటు అజేయంగా 70 పరుగులు చేసి భారత ‘ఎ’ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే ఆయనకు భారత సీనియర్ టెస్టు జట్టులో చోటు దక్కేలా చేసింది. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురుచూసి, కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగిన సారాంశ్ జైన్ ప్రయాణం.. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
Read Also: పతకాల వేటలో భారత్.. నేడు కీలక ఈవెంట్స్
Follow Us On : WhatsApp

