కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్ట్ ఆదేశించడం సంచలనంగా మారింది. ఈ తీర్పుపై రంగనాథ్ స్పందించారు. ‘గత రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నాను. రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించాం. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పనులు వేగంగా జరుగుతున్నాయి’ అన్నారు.
రూ.10 వేల కోట్ల భూమిపై కన్ను..
కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ‘లోతుకుంట భూమి విషయంలో రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. అనుమతి లేకుండా ప్రాచీనమైన కొండలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను నరికేస్తూ విధ్వంసం చేసింది. సేవ ది రాక్స్ సొసైటీ, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా.. హైడ్రా రంగంలోకి దిగింది. లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా నామీద కోర్ట్ ధిక్కరణ కేసు కూడా వేశారు’ అని పేర్కొన్నారు.
కేసులు వేయించింది వారే..
కోర్ట్ కేసులపై రంగనాథ్ స్పందిస్తూ.. ‘తన మీద 63 కోర్ట్ ధిక్కరణ కేసులను వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన వారు, సంధ్యా శ్రీధర్ రావు, నల్ల మల్లా రెడ్డి, ముఖీం.. వంటి వారికి హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. కేసులను చట్ట పరంగానే ఎదుర్కొంటాను. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా వంద శాతం ఫలితాలు వచ్చేలా పనిచేస్తాను’ అని స్పష్టం చేశారు.

