దేశ ప్రయోజనాల కోసమే రాజీనామా: దినేష్ పటేల్

కలం, నిజామాబాద్ బ్యూరో: భారతీయ జనతా పార్టీకి దేశం ముఖ్యమని, పదవులు కాదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు (Nizamabad BJP Chief)  దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిద్ధాంతాలకు కట్టుబడే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan)  నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన తప్పు లేకపోయినా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయారంటూ కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. పాఠ్యాంశాల నుంచి అక్బర్, బీర్బల్, మొఘలుల చరిత్రను తొలగించి, దేశ గొప్ప మహనీయుల చరిత్రను చేర్చినందుకే ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌లపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని దినేష్ పటేల్ విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించకపోవడంపై స్పందించాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే జెన్-జెడ్ యువతకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, తన మంత్రివర్గంలో ఎంతమంది జెన్-జెడ్ యువతకు అవకాశం కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా యువతకు అవకాశం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓ జెన్-జెడ్ యువకుడికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పొతన్‌కర్ లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, జ్యోతి, శివ ప్రసాద్, ఓం సింగ్, కిషోర్, రాము, కల్పే అర్చనా, పిల్లి శ్రీకాంత్, విజయ్, పురుషోత్తం, అన్నం గోపి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>