కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని వశిష్ట పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సుమారు 80 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. అయితే పాఠశాలలో విద్యాబోధన సంతృప్తికరంగా లేకపోవడంతో పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థులను మరో పాఠశాలకు బదిలీ చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని తక్షణమే మరో పాఠశాలకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

