కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలన్నారు. నిర్వాసితులైన కుటుంబాలకు సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నెలవారీ పింఛన్ ఇవ్వాలి..
సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పింఛన్ రూ.10 వేలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి వివేక్ కోరారు. తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి అభివృద్ధి, బొగ్గు గనుల విస్తరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ అంశాలపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

