కనుల పండువగా గోరింటాకు వేడుకలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని గద్వాలలోని (Gadwal) ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Priyadarshini Govt Degree College) సోమవారం గోరింటాకు వేడుకలను (Gorintaku Celebrations)  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా మైదాకు చెట్టుకు మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహజ సిద్ధమైన గోరింటాకులను అందరూ కలిసి మెత్తగా నూరి గౌరీ దేవిని పూజించారు. ఆ తర్వాత మహిళలు, విద్యార్థినులు ఒకరినొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. మీనాక్షి మాట్లాడుతూ, గోరింటాకు పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఆషాఢమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయత కూడా ఉందని పేర్కొన్నారు. గౌరీ దేవికి ప్రీతిపాత్రమైన గోరింటాకును ఈ మాసంలో ధరించడం సనాతన ధర్మంలో భాగమన్నారు. గోరింటాకు భారతీయ సంస్కృతికి ప్రతీక అని, మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వ రంగాలలో మరింతగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. మహిళా సాధికారత విభాగం కన్వీనర్ డాక్టర్ ఎం. సమత మాట్లాడుతూ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థినులలో సంప్రదాయ విలువలు, ఐక్యతా భావం, మహిళా సాధికారతపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, మహిళా సాధికారత విభాగం సభ్యులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>