కలం, వెబ్‌డెస్క్: బోండా ఉమా (Bonda Uma) వ్యవహారంలో సీఎం చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముద్రగడ సంతాప సభలో తనను కలిసినందుకు బోండా ఉమా నుంచి చంద్రబాబు వివరణ కోరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరు విచిత్రంగా ఉందని అంబటి అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అవన్నీ పక్కన పెట్టి అంబటి, బోండా వేదిక పంచుకోవడంపై చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అలాగే బోండా ఉమా, తాను కలిసిన సందర్భాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఆ సభ తాను పెట్టింది కాదని, తామేమీ రాజకీయాలు మాట్లాడుకోలేదని చెప్పారు. ఒక కాపు నాయకుడి సంతాప సభలో విషాదాన్ని పంచుకోవడానికి కాపు నేతలంతా కలిశారని తెలిపారు. ఈ సభకు జనసేన, కాంగ్రెస్, వైసీపీ.. ఇలా అన్ని పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారన్నారు. కాపులంతా ఒకే చోటుకు చేరితే చంద్రబాబు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ముద్రగడపై ఉన్న కోపాన్ని చంద్రబాబు ఈ విధంగా చూపిస్తున్నారా? లేక బోండా ఉమా, అంబటి రాంబాబులపై కోపంతో ఇలా వ్యవహరిస్తున్నారా? అని నిలదీశారు.
బోండా ఉమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారన్న కోపం ఉంటే దాన్ని నేరుగా ప్రశ్నించాలని అంబటి, చంద్రబాబుకు సూచించారు. అంతేకానీ తనతో వేదిక పంచుకున్నారని ప్రశ్నించడం సరికాదన్నారు. ఇటీవల జ్యోతుల నెహ్రూ కూడా తమను కలిశారని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముద్రగడ దహన కార్యక్రమాలకు కూడా జ్యోతుల నెహ్రూ వచ్చారన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. రాజకీయ నేతలు పార్టీలు వేరైనంత మాత్రాన పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, విషాదాలకు కలుసుకోకూడదా? అని ప్రశ్నించారు.
ఇక కాపుల్లో అలజడి మొదలైందని బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. ఆ వ్యాఖ్యలపై చంద్రబాబుకు ఇబ్బందిగా ఉంటే వ్యక్తిగతంగా ఆయన నుంచి వివరణ తీసుకోవాలన్నారు. జనసేనకు సంబంధించిన అనేక మంది నాయకులు కూడా సంతాప సభకు వచ్చారని, కానీ, పవన్ కల్యాణ్ ఎక్కడా చంద్రబాబులాగా మాట్లాడలేదని అంబటి స్పష్టం చేశారు. విషాదకర ఘటనలను కూడా వివాదం చేసే క్రూరత్వం చంద్రబాబు సొంతమని విమర్శించారు.

