మిర్యాలగూడలో హైటెన్షన్.. ఇల్లు కోసం సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్

కలం, మిర్యాలగూడ: ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనే వినూత్న డిమాండ్‌తో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన షేక్ యూనుస్ అనే వ్యక్తి తనకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జియో సెల్ టవర్ ఎక్కాడు.

టవర్‌పై నుంచి కేకలు వేస్తూ హల్ చల్ చేయడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పైనున్న యూనుస్‌తో మాట్లాడి, అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన యూనుస్‌ను పోలీసులు సురక్షితంగా టవర్‌పై నుంచి కిందికి దించారు. అనంతరం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో కాసేపు స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>