వెంకట్యా తండాలో తీజ్ వేడుకలు.. బంజారాలతో ఎమ్మెల్యే ఆదినారాయణ సందడి

కలం, ఖమ్మం బ్యూరో: గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే సంబరం ‘తీజ్’. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని వెంకట్యా తండాలో ఈ తీజ్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ ఘనంగా జరిగాయి. మన గ్రామీణ, గిరిజన సంస్కృతికి పట్టం కడుతూ సాగిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జారే ఆది నారాయణ (MLA Jare Adinarayana) ముఖ్య అతిథిగా పాల్గొని, బంజారాల ఆటపాటల్లో లీనమై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

​తండాకు చేరుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణకు బంజారా కుల పెద్దలు, స్థానికులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బంజారాల సాంప్రదాయ తలపాగాను ధరించి, గిరిజనులలో ఒకరిగా మారిపోయారు. బంజారా యువతీ యువకులు, తండావాసులతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా అడుగులేస్తూ, డ్యాన్స్ చేసి స్థానికుల్లో సరికొత్త జోష్ నింపారు.

​అనంతరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని, గ్రామ ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు. మన గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, తరతరాలుగా వస్తున్న ఈ పండుగలను, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తండా ప్రజలందరికీ, బంజారా సోదరసోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో స్థానిక బంజారా కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్ద సంఖ్యలో తండావాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>