ప్రధాన్ రాజీనామా వెనుక భారీ వ్యూహం!

క‌లం, న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వెనుక బీజేపీ వ్యూహం (BJP Strategy) దాగి ఉన్నట్టు తెలుస్తున్నది. విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి కేంద్రం వెనకడుగు వేసినట్టు కనిపించినా బీజేపీ పెద్ద ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. పార్లమెంటులో కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవడం.. ఉద్యమం దేశవ్యాప్తంగా పాకకుండా చూసుకోవడం వంటి వ్యూహాలతో బీజేపీ ఉన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక కేవలం విద్యార్థుల నిరసనల ఒత్తిడే కాకుండా, పార్లమెంట్‌లో ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కీలక రాజకీయ అజెండాను కాపాడుకోవాలనే వ్యూహం కూడా ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే జంతర్‌మంతర్ వద్ద మొదలైన ఆందోళనలకు దేశవ్యాప్తంగా యువత నుంచి మద్దతు దక్కింది. పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టడం ఇబ్బంది కరంగా మారింది.

తొలుత వెనకడుగు..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రధానంగా తెరమీదకు వచ్చినప్పటికీ బీజేపీ వెంటనే ఆ నిర్ణయం తీసుకోలేదు. నిరసనల ఒత్తిడికి మంత్రి రాజీనామా చేస్తే అది భవిష్యత్తులో ఒక రాజకీయ సంప్రదాయంగా మారే అవకాశం ఉందనే ఆందోళనతోనే పార్టీ తొలుత వెనుకంజ వేసినట్టు సమాచారం. అయితే కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడం, సోనం వాంగ్‌చుక్ దీక్ష, పోలీసుల బలప్రయోగంపై విమర్శలు, ప్రతిపక్షాల మద్దతు వంటి పరిణామాలతో ఈ అంశం పార్లమెంట్ సమావేశాల ప్రధాన చర్చగా మారింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితి వచ్చింది.

ప్రతిష్ఠంభన తొలగించేందుకు

డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక చట్టాలను ప్రవేశపెట్టాలంటే సభలో ప్రతిష్ఠంభన తొలగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఉద్యమం కొనసాగినంత కాలం ప్రభుత్వం అసలు అజెండాను ముందుకు తీసుకురావడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం ద్వారా ఉద్యమ తీవ్రతను తగ్గించి, పార్లమెంట్‌లో రాజకీయ వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మంత్రిని కొనసాగించడం కంటే ప్రభుత్వ దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చిందనే విశ్లేషణ వినిపిస్తున్నది.

గతంలోనూ ఇదే పరిస్థితి..

బీజేపీ గతంలో కూడా అవసరమైన సందర్భాల్లో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిన ఉదాహరణలు ఉన్నాయని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. గతంలో రైతుల ఉద్యమం నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం కూడా అలాంటి నిర్ణయాల్లో ఒకటిగా చెబుతున్నారు. రాజకీయంగా పరిస్థితులు అదుపు తప్పే అవకాశం కనిపించినప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గి, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం బీజేపీ వ్యూహంలో భాగమని కొందరు విశ్లేషిస్తున్నారు. త్వరలో పార్లమెంటులో కీలక బిల్లులు ఆమోదించుకొనేందుకు ఎన్డీయే సర్కారు మార్గం సుగమం చేసుకున్నదని తెలుస్తున్నది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>