కలం, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం జై జవాన్.. జై కిసాన్.. నినాదం దేశప్రజలందరికీ చిరపరిచితం. ఇప్పుడు ఆ రెండింటితో పాటు ‘జై యువ’ అనే కొత్త నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. శాసనమండలికి, రాజ్యసభకు పోటీ చేసే వయసును 25 సంవత్సరాలుగా మార్చాలన్నారు.
దీనిపై ఆగస్టు నెలలో అసెంబ్లీ, కౌన్సిల్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి లోతుగా చర్చించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఐఏఎస్, ఐపీఎస్లుగా 21 సంవత్సరాలకే..
నేటి యువత 21 ఏండ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సేవలందిస్తున్నారని, స్థానిక సంస్థల్లోనూ ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ప్రపంచస్థాయి సంస్థలకు కూడా నాయకత్వం వహిస్తున్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ రంగాల్లో ప్రతిభను చాటుతున్న యువతకు చట్టసభల్లోనూ ఆ వయసులో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గతంలో ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేదని, దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏండ్లకే తగ్గించుకున్నామని సీఎం రేవంత్ గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 21 ఏండ్లకు 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా సవరించామన్నారు.
అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు.. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 30 నుంచి 25 ఏండ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆగస్టు నెలలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ అంశంపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత పోటీ వయోపరిమితి తగ్గింపును కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు.
కీలక బిల్లులతో పాటే దీనిపైనా ఆమోదం
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్తుకు అవసరమని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సీబీఎస్ఈ, నీట్, నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను సమీక్షించడంతో పాటు నష్టపోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలన్నారు.

