కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలోని అంజనాపురం–జింకలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ బ్రిడ్జి(Sita Rama Canal Bridge) ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి పరిస్థితి చూస్తే మృత్యుకూపాన్ని తలపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో బ్రిడ్జిపై ఉన్న కాంక్రీట్ పొర పూర్తిగా దెబ్బతింది. దీంతో లోపలి ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. రహదారిపై ఏర్పడిన భారీ గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ మార్గం గుండా ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సైతం ప్రయాణిస్తుంటారు. బ్రిడ్జి దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించే ముందే అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అంజనాపురం, జింకలగూడెం ప్రజలు బ్రిడ్జికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

