రుణమాఫీపై తుమ్మలకు పువ్వాడ సవాల్

కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రైతు రుణమాఫీ కేవలం కాగితాలకే పరిమితమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఏదైనా ఒక గ్రామంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల (Minister Tummala) నాగేశ్వరరావుకు బహిరంగ సవాల్ విసిరారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జెండా దిమ్మె వద్ద ఆదివారం గులాబీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

రైతులకు ఇస్తామని చెప్పిన రూ.500 బోనస్ పూర్తిగా బోగస్‌గా మారిందని ఆరోపించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, షాపులలో అందుబాటులో ఉన్న ఎరువులను డిజిటల్ యాప్‌ల పేరుతో సమస్యాత్మకంగా మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు పెరిగాయని, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. “రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు” అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఖమ్మం ప్రజలు ఎప్పటికీ మరచిపోరని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను తొలగించాలని చూస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజల హృదయాల్లో ఉన్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతి గ్రామంలో గులాబీ జెండాను మరింత ఎత్తుగా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>