కలం, ఖమ్మం బ్యూరో: గ్రామపంచాయతీ కార్మికులతో (Gram Panchayat workers) వెట్టిచాకిరీ చేయించుకోవడం మానేసి, వారికి నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 51ను రద్దు చేసి, మల్టీపర్పస్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో (Raghunadhapalem) ఆదివారం నిర్వహించిన ఏఐటీయూసీ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు కేవలం రూ.8,500 మాత్రమే చెల్లించడం శ్రమదోపిడీ అని విమర్శించారు. కనీస వేతనాల చట్టం ప్రకారం అయినా రూ.16 వేల వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 54 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ చేసే కార్మికులకు రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. ప్రమాదాలలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన కార్మికులకు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టంగుటూరి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సీపీఐ నాయకులు, ఏఐటీయూసీ ప్రతినిధులు, గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

