కలం, తెలంగాణ బ్యూరో: యువత కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొత్త నినాదం ఇచ్చారు. జై జవాన్.. జై కిసాన్‌కు తోడుగా ఇప్పుడు ‘జై యువ’ నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగ సవరణ చేయాలి..
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనమండలికి, రాజ్యసభకు పోటీ చేసే వయసును 25 సంవత్సరాలుగా మార్చాలన్నారు. ఇందుకోసం పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాది..
ఆగస్టులో రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి లోతుగా చర్చించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సీఎం రేవంత్ అన్నారు. యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
21 ఏళ్లకే సత్తా చాటుతున్న యువత..
21 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా దేశానికి సేవలందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి సంస్థలకు కూడా నాయకత్వం వహిస్తున్నారని.. టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ రంగాల్లో ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మరి, వారికి చట్టసభల్లోనూ ఆ వయసులో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఓటు హక్కు వయస్సు తగ్గించుకున్నాం..
దేశంలో గతంలో ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేదని, దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే తగ్గించుకున్నామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 21 ఏళ్లకు 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా సవరించామన్నారు. అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు.
కేంద్రం పరిశీలించాలి..
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్తుకు అవసరమని తెలిపారు.

