కలం, నిర్మల్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ (Adilabad Airport) కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ.2,278.14 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది.
1,700 ఎకరాల భూమి అవసరం..
విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్ మాత్రమే కాకుండా నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు అభివృద్ధి చెందనున్నాయి. విమానాశ్రయం నిర్మాణానికి సుమారు 1,700 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే రన్‌వే, టెర్మినల్ భవనం, కార్గో కేంద్రం, రహదారి అనుసంధానం తదితర మౌలిక సదుపాయాల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది.
వేగంగా అభివృద్ధి చెందే అవకాశం..
విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కొత్త పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడటంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. ఎన్నికల ముందు
ప్రధాని మోదీ హామీ..
ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయం ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పలుమార్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆదిలాబాద్‌కు విమానాశ్రయం అవసరాన్ని వివరించారు.
కేంద్ర రక్షణ శాఖ ఆమోదం..
విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ ఇటీవల ఈ ప్రాజెక్టుకు అనుమతి తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో భూసేకరణ, సాంకేతిక పరిశీలనలు, తదుపరి అనుమతుల ప్రక్రియ పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కల అయిన ఆదిలాబాద్ విమానాశ్రయం త్వరలోనే సాకారమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శాఖల వారీగా కేటాయింపులు..
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భాగంగా వివిధ శాఖలు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిధులు కేటాయింపులు చేశారు. భూ సేకరణకు రూ.1555.11 కోట్లు, ఆర్అండ్‌బీ శాఖకు రూ.35 కోట్లు, విద్యుత్తు శాఖకు రూ.310 కోట్లు, విద్యుత్తు లైన్ల మార్పు కోసం రూ.18.76 కోట్లు, మిషన్ భగీరథ కోసం రూ.3.55 కోట్లు కేటాయించారు.
సీఎంకు డీసీసీ అధ్యక్షుడి కృతజ్ఞతలు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భారీగా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే జిల్లా వాసుల కల నెరవేరబోతుందని.. ఎయిర్‌పోర్ట్ రాకతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

