కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా విద్యార్థి ఐక్య పోరాట విజయకేతనానికి నిదర్శనం

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : విద్యా వ్యవస్థ మూలాలను విధ్వంసం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ నడిబొడ్డున శాంతియుతంగా విరోచితంగా పోరాడుతున్న విద్యార్థులపై పాశవిక దమనకాండతో లాఠీ చార్జ్, వాటర్ ఫిరంగు, బాష్పవాయువు గోళాలతో విచక్షణ రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ దమనకాండ లాఠీ చార్జీల నిరసిస్తూ ఢిల్లీ విద్యార్థుల పోరాటాలకు సంఘీభావంగా శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar ) జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏఐటీయూసీ, టియుసిఐ, టిఎఫ్టియు, ఐఎన్టియుసి, బిఆర్ టియు, టిఎన్టియుసి, తదితర కార్మిక సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్, టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్,టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎం.ఖలీల్, ఐఎన్టియూసి జిల్లా కార్యదర్శి మాకం రామ్మోహన్, బిఆర్టియు జిల్లా నాయకులు బాబు మియ్య, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు ధన్వాడ రాములు మాట్లాడుతూ.. పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రారంభమైన విద్యార్థుల విరోచిత పోరాటాని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉక్కు పాదంతో అనచి వేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. శాంతియుత విద్యార్థుల పోరాటం పైన కేంద్ర ప్రభుత్వం క్రూరంగా దమనకాండను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

విద్యార్థుల ఐక్య పోరాటం పాలక వర్గ పీఠాలను కదిలిస్తుందని దాని నుండి ఉపశమనం కోసమే ప్రధాని మోదీ పోరాటానికి తలొగ్గి దిగి వస్తున్నారని అన్నారు. ఢిల్లీలో పోరాటమైన విద్యార్థుల పోరాటం గల్లి నుంచి ప్రపంచ స్థాయికి పాకిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వర్గం ఉసురు తీసే విధానాలను అవలంబిస్తుందని విద్యార్థుల పోరాటం స్ఫూర్తిగా తీసుకొని రైతాంగ కార్మిక వర్గం పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని విద్యార్థి యోధులకు విప్లవ జేజేలు అని అభినందించారు.

నీట్ పరీక్షలో మృతి చెందిన బాధిత విద్యార్థి కుటుంబాలకు కోటి నష్టపరిహారం అందించాలని, పోలీస్ దమనకాండకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తు ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కార్మిక సంఘాల ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటియుసి,సిఐటియు,టియుసిఐ, ఐఎన్టియుసి,బిఆర్టియు,టిఎన్టియుసి, ఇతర కార్మిక సంఘాల జిల్లా నాయకులు రాజ్ కుమార్,ఖమర్ అలి,వరద గాలేన్న, వెంకటయ్య,గట్టన్న, పాష,చెన్నయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>