కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శనివారం రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు (Vijaya Ramana Rao) ప్రారంభించారు. అంతకుముందు “జలసిరి” పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఓదెల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ.46,30,336 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లా విద్యావ్యవస్థను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు ఇటీవల గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించారు.
కొద్ది నెలల క్రితం శ్రీరాంపూర్‌లో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించామని, నేడు ఓదెల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు.
జిల్లాలో డబుల్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పోత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గత ఏడాది శ్రీరాంపూర్, ఓదెల మండలాల టెయిల్ ఎండ్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందించగలిగామని చెప్పారు. గత సీజన్‌లో అధిక వర్షాలు కురిసిన సమయంలో రానున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి చెరువులను నింపాలని అధికారులకు సూచించామని, ఆ సమయంలో తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం ఈ మండలాల్లో కొంత మేర నీరు అందుబాటులో ఉందన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలను చూసి నీటి సమస్య ఉండదనే అపోహలో రైతులు ఉండవద్దని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కందులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేయవచ్చని వివరించారు. కందులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, నాలుగు నెలల్లోనే పంట చేతికి వచ్చి క్వింటాల్‌కు సుమారు రూ.10 వేల వరకు ధర లభిస్తోందన్నారు. ఆగస్టు నెలలో నువ్వుల సాగు కూడా చేపట్టవచ్చని, వాటికి క్వింటాల్‌కు సుమారు రూ.9 వేల వరకు మార్కెట్ ధర లభిస్తోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని, వారి సూచనలు పాటించకుండా అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేస్తే రానున్న రోజుల్లో నీటి కొరత కారణంగా పంటలను కాపాడుకోవడం రైతులకు చాలా కష్టమవుతుందని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు వంద ఎకరాలకు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రతి రోజూ మంచి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని, ప్రతి రైతు పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా పంటల ఎంపిక చేసుకోవాలని కోరారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు లభించే అవకాశముందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామని, ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు.
పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5.5 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. గతంలో పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గతంలో నెలకు కేవలం 30 నుంచి 40 ప్రసవాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం నెలకు సుమారు 250 ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కానుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు, తహసిల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్ లు, మార్కెట్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

