కలం, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత లాన్ బౌల్స్ జోడీ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. మహిళల జోడీ విభాగంలో రూపా రాణి తిర్కీ(Rupa Rani) , పింకీ సింగ్ (Pinki Singh) టోంగాపై టైబ్రేకర్‌లో 2-0తో విజయం సాధించి సెమీఫైనల్ అవకాశాలను మరింత బలపరిచారు. మహిళల జోడీ విభాగం (సెక్షన్-బి)లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి సెట్‌ను 5-2తో గెలుచుకుంది. అయితే మ్యాచ్ ఆరంభంలో టోంగా మెరుగైన ఆటతో 1-0 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రూపా, పింకీ అద్భుత సమన్వయంతో తిరిగి పుంజుకుని స్కోరును సమం చేశారు. అదే జోరును కొనసాగిస్తూ తొలి సెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండో సెట్లో టోంగా బలంగా తిరిగి వచ్చింది. తొలి మూడు ఎండ్లలోనే 6-0 ఆధిక్యం సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచింది. రూపా, పింకీ చివరి వరకు పోరాడినా ఆ సెట్‌ను 6-4తో టోంగా గెలిచి మ్యాచ్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక టైబ్రేకర్‌లో మాత్రం భారత జోడీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. రూపా జట్టుకు ఆధిక్యం అందించగా, పింకీ మ్యాచ్‌ను విజయంతో ముగించారు. దీంతో భారత్ 2-0తో టైబ్రేకర్‌ను సొంతం చేసుకుని మరో విలువైన విజయాన్ని నమోదు చేసింది.
రూపా రాణి తిర్కీ, పింకీ సింగ్ ఇద్దరూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల ఫోర్స్ జట్టుతో కలిసి స్వర్ణ పతకం గెలిచిన సభ్యులే. ఆ అనుభవాన్ని ఈ మ్యాచ్‌లో కూడా చక్కగా వినియోగించారు. సెక్షన్-బిలో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ఒక సెట్ ఎక్కువగా గెలిచిన కారణంగా ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్ మాత్రం సెమీఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా కొనసాగుతోంది.

