కలం, కరీంనగర్ బ్యూరో : ఆగస్టు 15వ తేదీ లోపు రోళ్ల వాగు ప్రాజెక్టు షెల్టర్లు ఏర్పాటుచేసి రోళ్ళవాగు ప్రాజెక్టులో నీటి నిలువ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పై శనివారం హైదరాబాదులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ధర్మపురి నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా ఇరువురు మంత్రులు అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నిర్మిస్తున్న రోళ్ళవాగు ప్రాజెక్టు కు షెల్టర్లు బిగించి ఆగస్టు 15వ తేదీ వరకు 0.25 టీఎంసీల నీటిని నిలువ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రోళ్ళవాగు ప్రాజెక్టు కాలువల పూడికతీత పనులకు అంచనాల తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధర్మపురి మండలంలోని అక్కపల్లి లిఫ్ట్ పనులు ఆరు నెలల లోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2027 జనవరి చివరి కల్లా అక్కపల్లి ఎత్తిపోతల పథకం నుండి రైతులకు నీటిని అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
వెల్గటూర్ మండలంలోని జంగల్ నాల ప్రాజెక్టు అభివృద్ధి పనులు, గొల్లపల్లి మండలంలో యశ్వంత్ రావు పేట, రంగధాముని పల్లి చెరువు ఊడిక తీత పనులకు అంచనాలు తయారు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి మండలంలోని నక్కల పేట గ్రామంలో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ధర్మపురి మండలంలో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తాం : మంత్రి అడ్లూరి
ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలో ని రైతులకు కావాల్సిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంతో కమిషన్ల కొరకు మాత్రమే ప్రాజెక్టుల పనులు చేశారని తాము మాత్రం రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతూ పనులు పూర్తి చేయడానికి ముందుకు సాగుతుందని మంత్రి అడ్లూరి తెలిపారు.

