కలం, నిర్మల్: నీట్ పరీక్ష పత్రం లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ నిర్మల్ కాంగ్రెస్ (Nirmal Congress) పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వివేక్ చౌక్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది.
నాయకులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదని, లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

