కలం, కరీంనగర్ : వామపక్ష విద్యార్థి సంఘాలు పోరాటాల ఉదృతం చేయడం వల్లే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విద్యార్థి ఉద్యమాలకు తలొగ్గి రాజీనామా చేశారని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి పేర్కొన్నారు. ఇది విద్యార్థుల పోరాట ఫలితమేనని తెలిపారు. విద్యార్థుల పోరాటాల పట్ల బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఎన్ని కుట్రలు, నిందలు వేసినప్పటికీ విద్యార్థి పోరాటాలకు తలొగ్గారని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వాస్తవమేనని ఒప్పుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థి ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడారని, ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు చెంప పెట్టులా రాజీనామా చేశాడని పేర్కొన్నారు. వెంటనే బండి సంజయ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం లో ఇప్పటికి మూడు సార్లు పేపర్ లీకేజ్ కావడం వల్ల లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని, వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ప్రభుత్వం లీకేజీలు జరిగితే నామమాత్రం చర్యలు తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే లీకేజీలు, అవకతవకలు అరికట్టవచ్చని పేర్కొన్నారు.
ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లీకేజీ జరిగినప్పుడే చేసి విద్యార్థులకు భరోసా కలిగిస్తే 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే వారు కాదని, ఢిల్లీలో న్యాయం కోసం పోరాడిన విద్యార్థి యువతపై దాడులు, రక్తపాతం జరిగేవి కాదని, దీనికి ముమ్మాటిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య కేంద్రీకరణను వెనక్కి తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని అనేక ఉద్యమాలు విద్యార్థులను ఏకం చేసి ఐక్యం చేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

