కలం, వనపర్తి: ఒకవైపు అర్ధరాత్రి వచ్చిన ఫోన్‌కైనా వెంటనే స్పందించాలి, గృహహింసకు గురైన మహిళను ఆదుకోవాలి… ప్రమాదంలో ఉన్న చిన్నారిని రక్షించాలి, పోలీసులతో సమన్వయం చేయాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి… ఇవన్నీ వనపర్తి (Wanaparthy ) జిల్లా మహిళా–శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిత్య విధులు. ఈ సేవలను ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర అత్యంత కీలకం.
కుటుంబ కలహాలు, గృహహింస, బాలికలపై వేధింపులు, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికుల రక్షణ, అనాథ పిల్లల సంరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, మహిళలకు అవగాహన కార్యక్రమాలు వంటి బాధ్యతలను వీరే భుజాన మోస్తున్నారు. సమయం, సెలవు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఫోన్ వస్తే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవడం వీరి విధి. కానీ ప్రజలకు అండగా నిలుస్తున్న ఈ ఉద్యోగులకే సమయానికి జీతాలు అందడం లేదు.
నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంక్షేమ శాఖ కార్యక్రమాల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బాధిత మహిళలు, చిన్నారులకు 24 గంటల పాటు సేవలందిస్తున్న మహిళా–శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సహాయక చర్యల్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, సమయానికి జీతాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వీరి దినచర్య పూర్తిగా ప్రజాసేవలతో ముడిపడి ఉంటుంది. వనపర్తి జిల్లా మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలో 49 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల కింద డీసీపీయూ, బాలసదన్, చైల్డ్ హెల్ప్‌లైన్–(1098), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), సఖి కేంద్రం-(181), సీనియర్ సిటిజెన్ (14567), డీహెచ్‌ఈడబ్ల్యూ, ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 39 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి ఉన్నతాధికారి వరకు చెప్పిన పనులన్నీ చేస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, వీరి వేతనం అంతంతే ఉన్నది. అయితే ఉద్యోగార్హతను బట్టి నెలకు రూ.12 వేల నుంచి రూ.38 వేల వరకు మాత్రమే వేతనాలు పొందుతున్న వీరికి, అవి కూడా నెలనెలా అందడం లేదని వాపోతున్నారు.
ప్రతి నెల సుమారు రూ.11 లక్షల వేతన బిల్లులు విడుదల కావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలలుగా సుమారు రూ.29 లక్షల మేర వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో కొన్ని విభాగాల్లో మూడు నుంచి తొమ్మిది నెలల వరకు కూడా జీతాలు ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. వేతనాలు ఆలస్యం కావడంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, కిరాణా ఖర్చులు, విద్యుత్ బిల్లులు, వైద్య ఖర్చులు తీర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోందని కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో నెల జీతంపైనే కుటుంబ జీవనం ఆధారపడి ఉందని, జీతాలు ఆలస్యమైతే ఇంటి నిర్వహణ పూర్తిగా దెబ్బతింటోందని చెబుతున్నారు.
తక్కువ వేతనంతోనే కుటుంబాలను పోషిస్తున్న తమకు జీతాల జాప్యంతో మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వ సేవల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తమ కష్టానికి తగిన గుర్తింపు లేదని ఉద్యోగులు చెబుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. కీలక ప్రభుత్వ పథకాల అమలులో తమ సేవలు వినియోగించుకుంటున్నా, కనీస వేతన భద్రత కూడా కల్పించకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, తమ వేతనాల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో మినహాయింపులు చేస్తున్నప్పటికీ, ఆ మొత్తాలు సంబంధిత ఖాతాల్లో జమ అవుతున్నాయా? లేదంటే ఎక్కడికి వెళ్తున్నాయి? అనే విషయాలపై స్పష్టత లేదని ఉద్యోగులు చెబుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పూర్తి వివరాలు వెల్లడించాలని, ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమపై ఉందని, కానీ తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు దీనిపై విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ఉద్యోగ హక్కుల అమలులో పూర్తిగా పారదర్శకతతో ఉండాలని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అధికారి వివరణ
మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అనుబంధంగా ఉన్న పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగుతున్న వారికి వేతనాలు పెండింగ్లో ఉన్న విషయం వాస్తవమేనని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె. సుధారాణి, అన్నారు . తమ శాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. వేతనాల పెండింగ్ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాగానే వేతనాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

