కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సోలార్ మోడల్ విలేజ్’ (సౌర విద్యుత్ ఆదర్శ గ్రామం) కార్యక్రమంలో భాగంగా గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో గృహాలు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విద్యుత్ శాఖ, టి.జి రెడ్కో (TGREDCO) అధికారులతో కలిసి వెన్నచేడ్ గ్రామంలో చేపడుతున్న సోలార్ ప్రాజెక్ట్ పురోగతి పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తెలంగాణ మోడల్ సోలార్ గ్రామాల’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామాన్ని సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు ఆమె వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను, ఆసక్తి ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పంపు వ్యవస్థలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. వెన్నచేడ్ గ్రామంలో మొత్తం 726 గృహ జ్యోతి విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో 261 గృహాలు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీటిలో ఇప్పటివరకు 116 గృహాల్లో 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు.అలాగే గ్రామంలో మొత్తం 447 వ్యవసాయ మోటార్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటివరకు 64 మంది రైతులకు 7.5 హెచ్‌పీ (HP) సామర్థ్యం గల సోలార్ పంపుసెట్లను అమర్చినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిగిలిన పనులను కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెడ్కో జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, TGSPDCL ఎస్ఈ భీమా నాయక్, విద్యుత్ శాఖ డీఈ లక్ష్మణ్ నాయక్, ఏడీఈ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

