జూరాలకు కృష్ణా జలాలు.. రైతులకు ఊరట

కలం, జోగుళాంబ గద్వాల: కర్ణాటక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం(Krishna Flood water) పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేసిన నీరు శనివారం సాయంత్రానికి తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project)  చేరుకోనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వరద నీటి రాక కొంత ఊరటనిస్తోంది.

ప్రస్తుతం ఆల్మట్టి జలాశయానికి 88,228 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అక్కడి నుంచి 68,425 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 66,692 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అక్కడి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేశారు. ఈ నీరు నారాయణపేట జిల్లా తంగిడి ప్రాంతం మీదుగా జూరాల వైపు ప్రవహిస్తోంది. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం, ఎగువ ప్రాంతాలలో  వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్మట్టి నుంచి మరింత నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. దీంతో నారాయణపూర్ నుంచి ఔట్‌ఫ్లో కూడా పెరిగి జూరాలకు ఇన్‌ఫ్లో మరింత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. జూరాల ప్రాజెక్టు  పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.04 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల నీటిమట్టం పెరగడంతో పాటు, సాగునీటి అవసరాలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>