అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి కీలక ఆదేశాలు

కలం, వనపర్తి: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆగస్టు 15లోగా కనీసం ఒక జత, ఆగస్టు 25లోగా రెండో జత ఏకరూప దుస్తులు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi ) అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యమైన దుస్తులు కుట్టించి పంపిణీ చేయాలని సూచించారు.

విద్యార్థుల యూనిఫాంల పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 512 ప్రభుత్వ పాఠశాలల్లో 38,653 మంది, 15 కేజీబీవీల్లో 4,531 మంది, 3 మోడల్ స్కూళ్లలో 1,919 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 358 మంది స్వయం సహాయక సంఘాల టైలర్లకు శిక్షణ ఇచ్చి, మండలాలకు చేరిన వస్త్రాన్ని దశలవారీగా అందజేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు వ్యవసాయ శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కందులు, నువ్వులు, వేరుసెనగ వంటి పంటలను ప్రోత్సహించాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కూరగాయల సాగును కూడా విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్య నాయక్, ఇన్‌చార్జి డీఈఓ యాదయ్య, డీఆర్‌డీఓ ఉమాదేవి, వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>