కలం యాదగిరిగుట్ట: రోడ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ల్యాన్ని సహించబోమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు నుంచి మోత్కూరు వెళ్లే ప్రధాన రహదారిలో రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగి స్వయంగా పరిశీలించారు. విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టెండర్ రద్దు చేస్తాం..
అనంతరం సంబంధిత కాంట్రాక్టర్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోన్లో మాట్లాడి పనులు నిలిచిపోవడానికి కారణాలపై వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో పనులను తిరిగి ప్రారంభించాలని సూచించారు.
అలాగే యాదగిరిగుట్ట–తుర్కపల్లి రహదారిలో మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేసి, ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తామని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.

