కాంగ్రెస్ ‘చలో లోక్ భవన్’ ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ ముట్టడి కార్యక్రమం (Congress Protest) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా కేంద్రం అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణిని నశించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు నిరసన ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ లోక్ భవన్ వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఢిల్లీ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.

హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, నిరుద్యోగ యువత పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం వారి భయానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు.

ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి జడ్పీ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయడం సరికాదని, యువత న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.

Read Also: మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌కు సీజేపీ నిర‌స‌న‌కారుల వేధింపులు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>